స్మర వారం వారం - మానస! (కాఫీ రాగం -ఆది తాళం)
పరమహంస శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారు రచించిన " స్మర వారం వారం - మానస " కీర్తన
లోని ప్రతి చరణానికి తాత్పర్యం
మరియు విశేషాలు 31 -01 -2026
పల్లవి
స్మర వారం వారం - మానస!
స్మర నందకుమారమ్.
తాత్పర్యం:
ఓ మనసా! నందుని కుమారుడై వెలసిన ఆ పరమాత్మను మాటిమాటికీ,
పునఃపునః (మళ్ళీ మళ్ళీ) స్మరించుకో!
విశేషాలు:
- నిరంతర స్మరణ: భక్తి మార్గంలో మనసును నిలపడం కష్టం. అందుకే సదాశివ
బ్రహ్మేంద్రులు తన మనసును హెచ్చరిస్తూ, క్షణం
కూడా మర్చిపోకుండా ఆ నందకిశోరుని తలవమని కోరుతున్నారు.
- నందకుమారుడు: ఇక్కడ కృష్ణ పరమాత్మను 'నందుని
కొడుకు' అని పిలవడం ద్వారా భగవంతుడికి, భక్తుడికి
మధ్య ఉన్న వాత్సల్య అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు.
మొదటి చరణం
ఘోషకుటీరపయోఘృతచోరం
గోకులబృందావనసంచారమ్ ॥ స్మర ॥
తాత్పర్యం:
రేపల్లెలోని (గొల్లపల్లెల్లోని) ఇళ్ళలో వెన్నను దొంగిలించిన
వానిని, గోకులంలోనూ, బృందావనంలోనూ విహరిస్తూ వెలుగులు చిమ్మే ఆ నందకిశోరుని తలచి
తలచి మళ్ళీ స్మరించుకో!
విశేషాలు:
- వెన్న దొంగ (నవనీత చోర): గొల్ల ఇళ్ళలో పాలు, పెరుగు,
వెన్నలను దొంగిలించడం అంటే భక్తుల హృదయాలలోని ప్రేమను
దోచుకోవడమని అర్థం.
- దివ్య సంచారం: బృందావనంలో ఆయన సంచరించడం కేవలం ఆట కాదు, అది లోకానికి చైతన్యాన్ని, వెలుగును
పంచే దివ్య లీలా విశేషం.
రెండవ చరణం
వేణురవామృతపానవిలోలం
విశ్వస్థితిలయ హేతువిహారమ్ ॥ స్మర ॥
తాత్పర్యం:
మధురమైన మురళీ గానమనే అమృతాన్ని తాగుతూ పరవశించి ఉండేవాడిని,
ఈ విశ్వం యొక్క సృష్టి, స్థితి (పోషణ), లయలకు (ప్రళయం) కారకుడై విహరించే ఆ వేలుపు దొరను
వెన్నంటి నిలవాలని, వెంట వెంటనే తలచుకోవాలని అర్థం.
విశేషాలు:
- మురళీ గానం: కృష్ణుడి వేణుగానం ప్రకృతిని సైతం పులకింపజేస్తుంది. ఆ
గాన రసంలో పరమాత్మ తన్మయత్వం చెందుతారని ఇక్కడ వర్ణించబడింది.
- జగన్నాటక సూత్రధారి: పైన చూడటానికి గోపబాలుడిలా కనిపిస్తున్నా, ఈ సమస్త విశ్వాన్ని నడిపించే శక్తే ఆయనని
(సృష్టి-స్థితి-లయ కారకుడు) గుర్తుచేస్తున్నారు.
మూడవ చరణం
పరమహంసహృత్ పంజరకీరం
పటుతరధేనుక-బక-సంహారమ్ ॥ స్మర ॥
తాత్పర్యం:
పంజరంలో ఉన్న చిలుక వలె - పరమహంసల (శ్రీ సదాశివ
బ్రహ్మేంద్రుల వంటి యోగులు, గురువులు) హృదయాలలో స్థిరంగా నివసించేవాడిని, అత్యంత
బలవంతులైన ధేనుకాసుర, బకాసురులను సంహరించిన ఆ స్వామిని ఓ నా మనసా! ఎప్పుడూ
స్మరిస్తూ ఉండవమ్మా!
విశేషాలు:
- హృదయ పంజర కీరం: పంజరంలో చిలుక ఎలా ఉంటుందో, జ్ఞానులైన
మహర్షుల హృదయాలలో భగవంతుడు అలా బందీ అయి ఉంటాడని అందమైన పోలిక వాడారు.
- దుష్ట శిక్షణ: ధేనుకాసురుడు (గాడిద రూపంలో వచ్చినవాడు), బకాసురుడు (కొంగ రూపంలో వచ్చినవాడు) వంటి రాక్షసులను
అంతం చేయడం ద్వారా, భగవంతుడు అధర్మాన్ని అణచి భక్తులను రక్షిస్తాడని
తెలుస్తోంది.

No comments:
Post a Comment